జమ్మూ-కశ్మీర్: అసెంబ్లీ సమావేశంలో బుధవారం ఆర్టికల్ 370 పునరుద్ధరణ అంశంపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమావేశాలు ప్రారంభమైన వెంటనే, ఇంజినీర్ రషీద్ సోదరుడు, ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ “ఆర్టికల్ 370 పునరుద్ధరణ” అంటూ బ్యానర్ ప్రదర్శించారు. దీనిపై భాజపా నేత సునీల్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాగ్వాదం రగిలింది. క్షణాల్లోనే వివాదం తీవ్రరూపం దాల్చి, కొందరు ఎమ్మెల్యేలు పిడిగుద్దులతో పరస్పరం దాడులకు దిగారు.
అసెంబ్లీ మార్షల్స్ రంగంలోకి దిగి, ఇరువురి మధ్యలో నిలిచి ఎమ్మెల్యేలను విడదీశారు. భాజపా సభ్యులలో కొందరిని సభ నుండి బయటకు పంపించారు. ఈ ఘటనపై భాజపా నేతలు అసహనం వ్యక్తం చేస్తూ, స్పీకర్ పక్షపాత వైఖరిని విమర్శించారు. స్పీకర్, సభను కొద్దిసేపు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆర్టికల్ 370 పునరుద్ధరణ తీర్మానం!
జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తిరిగి ఇవ్వాలని కోరుతూ, పీడీపీ సభ్యులు ఆర్టికల్ 370 పునరుద్ధరణ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2019లో రద్దు చేసిన ఆర్టికల్ 370, 35ఎ పునరుద్ధరణతో పాటు ప్రత్యేక రాష్ట్ర హోదా కూడా పునరుద్ధరించాలని కోరారు. దీనిపై భాజపా సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, తీర్మానం కాపీలను చింపేశారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనా ఈ ఉద్రిక్తతపై స్పందిస్తూ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు జాతి వ్యతిరేక శక్తులకు సహకరిస్తున్నాయని ఆరోపించారు. “కాంగ్రెస్ కా హాత్ పాకిస్థాన్ కే సాత్, కాంగ్రెస్ కే హాత్ టెర్రరిస్టు కే సాత్” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.