అస్సాం: అస్సాంలో ఒక భారీ ఆన్‌లైన్ మోసం వెలుగుచూసింది, ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
రోజురోజుకు ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, రూ. 22 వేల కోట్ల విలువైన ఈ ఆర్థిక కుంభకోణం పోలీసుల దృష్టికి వచ్చింది.
పోలీసులు మరియు అధికారులు ఎంత అవగాహన కల్పించినా, ఇంకా మోసపోయే ప్రజలు తగ్గకపోవడం ఆందోళనకర అంశం.
తక్కువ సమయంలో అధిక లాభాలు అందిస్తామంటూ, ప్రజల సొమ్మును ముంచేసి మోసగాళ్ల ఆగడాలు విస్తృతమవుతున్నాయి.
మోసగాళ్ల గుట్టు రట్టు
తాజాగా అస్సాంలో వెలుగుచూసిన ఈ భారీ ఆన్‌లైన్ స్కామ్‌లో, దిబ్రూఘఢ్‌కు చెందిన 22 ఏళ్ల ఆన్‌లైన్ వ్యాపారి విశాల్ ఫుకాన్, గౌహతికి చెందిన స్వప్నిల్ దాస్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసులో ఇతర ముద్దాయిలను కూడా అదుపులోకి తీసుకునే అవకాశముందని పోలీసులు తెలిపారు. ఫుకాన్, తన పరపతిని ఉపయోగించి ప్రజలకు 60 రోజుల్లో వారి పెట్టుబడులపై 30 శాతం లాభం అందిస్తామని హామీ ఇచ్చి, ఈ భారీ మోసాన్ని నిర్వహించాడు.
నకిలీ కంపెనీలు, భూమి పలు ఆస్తులు
విశాల్ ఫుకాన్ నాలుగు నకిలీ కంపెనీలను స్థాపించి, అస్సామీ చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టినట్లు, పలు ఆస్తులను సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు.
దిబ్రూఘఢ్‌లోని ఆయన ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించి, అనేక కోట్ల కుంభకోణానికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఫుకాన్ నెట్‌వర్క్‌లో కీలక వ్యక్తిగా ఉన్న అస్సామీ కొరియోగ్రాఫర్ సుమీ బోరా కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు.
ముఖ్యమంత్రి హెచ్చరిక
మరోవైపు, ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. తక్కువ సమయంలో డబ్బును రెట్టింపు చేస్తామంటూ ఇచ్చే హామీలను నమ్మవద్దని ప్రజలను హెచ్చరించారు.
ఆన్‌లైన్ మోసాలకు దూరంగా ఉండాలని, ఇలాంటి మోసాలను సమర్థవంతంగా అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.