అమరావతి: వైకాపా నేత సజ్జలకు మంగళగిరి పోలీసులు నోటీసులు
మంగళగిరి రూరల్ పోలీసులు వైకాపా ప్రధాన నేత సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు. 2021 అక్టోబర్ 19న తెదేపా కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో భాగంగా ఆయనను విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని స్పష్టంగా నోటీసులో పేర్కొన్నారు. వైకాపా అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఈ దాడి ఘటనలో సజ్జల ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు ఆయన విదేశాలకు వెళ్లకుండా ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
తెదేపా కార్యాలయంపై జరిగిన ఈ దాడి ఘటనలో వైకాపా నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్, తలశిల రఘురామ్‌లను గతంలో పలు దఫాలుగా విచారణకు పిలిపించారు. ఈ కేసు సంబంధిత వివరాలను తెలుసుకోవడం కోసం ముఖ్య నాయకులను విచారించేందుకు పోలీసులు మరింత ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో సజ్జలను కూడా విచారించడానికి పోలీసుల సిద్దంగా ఉన్నారు. గతంలో ఈ కేసులో పలు కీలక అంశాలు వెలుగులోకి రావడంతో, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయంపై మరింత దృష్టి పెట్టారు.