ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ దేశ ఎన్నికల వ్యవస్థపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, పదవీ విరమణ తర్వాత ప్రత్యేక పదవి పొందేందుకు ప్రజాస్వామ్యాన్ని పణంగా పెడుతున్నారని ఆయన ఆరోపించారు.
ఈవీఎంల ద్వారా బీజేపీ పది శాతం ఓట్లను రిగ్గింగ్ చేయొచ్చని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ప్రజలను పెద్ద ఎత్తున ఓటింగ్‌కు రావాలని, బీజేపీ కుట్రలను ఎదుర్కోవాలని కోరారు.
“ప్రతి ఓటు ఆమ్ ఆద్మీ పార్టీకి పడాలి. 15 శాతం ఓట్ల ఆధిక్యత వస్తేనే మన విజయం ఖాయం,” అని చెప్పారు. ఎన్నికల కమిషన్ పూర్తిగా బీజేపీ చేతుల్లోకి వెళ్లిపోయిందని, రాజీవ్ కుమార్ బాధ్యతలను నైతికంగా నిర్వహించాలని కోరారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేగాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ దీనిపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఈ ఆరోపణలకు సమాధానంగా మారతాయా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.