న్యూ ఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అక్టోబర్ 15, 16 తేదీల్లో ఇస్లామాబాదులో జరగనున్న షాంఘై సహకార సంఘం (SCO) హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశానికి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. జైశంకర్ పర్యటన విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ధ్రువీకరించారు.
పాకిస్తాన్ ప్రస్తుతం SCO కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ రొటేటింగ్ చైర్మన్‌గా ఉంది. ఈ హోదాలో, అక్టోబర్ 15-16 తేదీలలో జరిగే SCO హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సదస్సుకు భారత్ సహా పలు దేశాలకు ఆహ్వానాలు అందాయి. ఆగస్టు 30న భారత ప్రభుత్వం పాకిస్తాన్ నుంచి ఈ ఆహ్వానం అందిన విషయాన్ని ధ్రువీకరించింది.
ఈ సందర్భంలో రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, “అక్టోబర్ 15-16 తేదీలలో ఇస్లామాబాదులో జరుగనున్న SCO సదస్సుకు జైశంకర్ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం హాజరుకానుంది” అని పేర్కొన్నారు. గతంలో జరిగిన మీడియా సమావేశంలో, ఇస్లామాబాదులో జరిగే SCO సమావేశానికి పాకిస్తాన్ ఆహ్వానం అందించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
SCO 2001లో రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్థాన్ నేతలచే స్థాపించబడింది. 2017లో భారత్, పాకిస్తాన్‌లు శాశ్వత సభ్యత్వం పొందాయి. గతేడాది భారత్ వర్చువల్‌గా SCO సమ్మిట్ నిర్వహించగా, ఇరాన్ శాశ్వత సభ్యత్వం పొందింది. ప్రస్తుతం SCOలో తొమ్మిది సభ్య దేశాలు ఉన్నాయి: భారత్, ఇరాన్, కజకిస్తాన్, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, పాకిస్తాన్, రష్యా, ఉజ్బెకిస్థాన్, తజికిస్తాన్.