టాలీవుడ్: షార్ట్ ఫిలిం ల ద్వారా మంచి ఫేమ్ సంపాదించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి క్యారెక్టర్ లు వేసి తన నటనకి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్. సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ లాంటి వాళ్ళు కూడా సుహాస్ యాక్టింగ్ తో జాగ్రత్తగా ఉండాలి అన్నారంటే అర్ధం చేసుకోవచ్చు ఇండస్ట్రీ లో సుహాస్ కి ఎలాంటి గుర్తింపు వచ్చిందో. సుహాస్ ఇదే ఫ్లో లో హీరో గా ‘కలర్ ఫోటో’ అనే సినిమా లో నటించాడు. తన మిత్రుడు సందీప్ రాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాని అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెన్నీ ముప్పనేని నిర్మించారు. ఈ సినిమాలో సుహాస్ కి జోడి గా ‘చాందిని చౌదరి’ నటించింది. ఈ సినిమాలో విలన్ గా సీనియర్ కమెడియన్ సునీల్ నటించడం ప్రత్యేకత. కీరవాణి తనయుడు ‘కాల భైరవ’ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, ‘తరగతి గది దాటి’ అనే పాట బాగా ఫేమస్ అయ్యాయి. అదే బాటలో మరో పాట విడుదల చేసారు సినిమా మేకర్స్. ఈ పాటని మంచు మనోజ్ ద్వారా విడుదల చేయించారు. ‘అరెరే ఆకాశంలో ఇల్లే కడుతున్నావా ‘ అంటూ సాగిపోయే ఈ మెలోడీ ఆకట్టుకుంటుంది. తెల్లగా ఉన్న అమ్మాయికి నల్లగా ఉన్న అబ్బాయి నచ్చడం అనే కాన్సెప్ట్ లో ఆకాశం లో ఇల్లు కడుతున్నావా అంటూ సాగే లిరిక్స్ సరిగ్గా కుదిరాయని చెప్పవచ్చు. విడుదల చేసిన వీడియో లో సుహాస్ తెల్లగా కనపడడానికి చేసే ప్రయత్నాలు అలాగే మధ్యలో వచ్చే సిగ్నేచర్ స్టెప్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఆహా ఓటీటీ లో అక్టోబర్ 23 నుండి స్ట్రీమ్ అవబోతుంది.