ఢిల్లీ: 2024 స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారాన్ని ప్రారంభించారు.
తన సోషల్ మీడియా ఖాతా ‘X’లో ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకంతో మార్చారు. జూలై 28న ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసారంలో ఈ ప్రచారాన్ని ప్రస్తావించిన ప్రధాని, ప్రజలను harghartirang.com వెబ్‌సైట్‌లో జాతీయ జెండాతో సెల్ఫీలు అప్‌లోడ్ చేయాలని కోరారు.
శుక్రవారం, అయన తన ప్రొఫైల్ డీపీని మార్చారు.
“నేను నా ప్రొఫైల్ చిత్రాన్ని మారుస్తున్నాను, మీరు కూడా అదే విధంగా చేయడం ద్వారా మన స్వతంత్ర దినోత్సవాన్నిజరుపుకోవడంలో నాతో చేరాలని మీ అందరినీ కోరుతున్నాను. ttps://hargartiranga.comలో మీ సెల్ఫీని షేర్ చేయండి” అని ప్రధాని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ప్రధాని తన ప్రొఫైల్ చిత్రాన్ని మార్చిన అనంతరం, ప్రజలు కూడా తమ ప్రొఫైల్ చిత్రాలను మార్చి, సెల్ఫీలు షేర్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారం కోసం బీజేపీ విస్తృత సన్నాహాలు చేసింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అన్ని ఆఫీస్ బేరర్లకు దానిని విజయవంతం చేయాలని సూచించారు.
ఆగస్టు 11 నుంచి 13 వరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ తిరంగా యాత్ర చేపడుతుందని, ఆగస్టు 12 నుంచి 14 వరకు స్వాతంత్ర్య సమరయోధులు, యుద్ధ స్మారక చిహ్నాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ప్రకటించారు.
ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇల్లు, వ్యాపార సంస్థపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని, దేశమంతా త్రివర్ణ పతాకంతో కళకళలాడాలని బీజేపీ ధ్యేయంగా పెట్టుకుంది.