fbpx
HomeAndhra Pradeshప్రజలకు సేవలు నిర్దిష్ట సమయంలోగా అందాలి

ప్రజలకు సేవలు నిర్దిష్ట సమయంలోగా అందాలి

GRAMA-WARD-SACHIVALAYAM-SERVICES-STIPULATED-TIME

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి సేవకు నిర్దిష్ట సమయం పెట్టామని, ఆ సమయంలోగా పూర్తి అవుతున్నాయా లేదా అనే విషయాన్ని కలెక్టర్లు, జేసీలు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. దీని ఆధారంగానే కలెక్టర్లు, జేసీల పనితీరును పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.

అర్హత ఉన్న వారికి నిర్దిష్ట సమయంలో సేవలు అందించకపోతే కలెక్టర్లు, జేసీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ‘స్పందన’లో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాలు, ఉపాధి హామీ పనులు, ఆర్బీకేలు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణం, స్కూళ్లు, అంగన్‌వాడీలు, ఆస్పత్రులలో నాడు–నేడు, ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే..

కలెక్టర్లు వారానికి రెండుసార్లు గ్రామ సచివాలయాలకు కచ్చితంగా వెళ్లాలి. వారానికి నాలుగు సార్లు జేసీలు వార్డు, గ్రామ సచివాయాలను సందర్శించాలి. సంబంధిత విభాగాల అధిపతులు (హెచ్‌ఓడీ), కార్యదర్శులు కూడా గ్రామ, వార్డు సచివాలయాలను నెలకు రెండు సార్లు సందర్శించాలి. ఇది కచ్చితంగా జరగాలి. దీన్ని సీఎం కార్యాలయం నుంచి స్వయంగా పర్యవేక్షిస్తాం.

200 మందితో కాల్‌ సెంటర్‌ పని చేస్తోంది. వార్డు, గ్రామ సచివాలయాల్లో అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. సచివాలయం, మండల, జిల్లా స్థాయి వరకు ఆ కాల్‌ సెంటర్‌ పరిధిలోకి వచ్చారు. హెచ్‌వోడీ, సెక్రటరీ స్థాయి వరకు కూడా దాని పరిధిలోకి తీసుకురాబోతున్నాం.

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా వున్న 16,208 పోస్టులకు ఈనెల 25, 26 తేదీల్లో పరీక్షలు నిర్వహించబోతున్నాం. మొత్తం 10.57 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 228 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular