వైఎస్సార్ జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థినిపై జరిగిన పెట్రోల్ దాడి కలకలం రేపుతోంది. ఈ ఘటనలో నిందితుడు విఘ్నేశ్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో, ఆ యువతి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. ఘటనకు సంబంధించి పోలీసులు నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
ఘటన వివరాల్లోకి వెళితే, నిందితుడు విఘ్నేశ్ చిన్నప్పటి నుంచి బాధిత యువతితో స్నేహం కొనసాగిస్తున్నాడు. అతడు ఇటీవల మరో యువతిని వివాహం చేసుకున్నప్పటికీ, ఈ విద్యార్థినితో తన సంబంధం కొనసాగించాలని కోరాడు. తనతో మాట్లాడాలంటూ ఆమెను కోరగా, ఆ అమ్మాయి రాకపోతే చనిపోతానని బెదిరించాడు. ఈ మాటలు నమ్మిన ఆమె అతడు చెప్పిన చోటకు వచ్చింది.
విద్యార్థిని కాలేజీ నుంచి బయలుదేరి ఆటోలో వెళ్ళి సెంచురీ ప్లైవుడ్ ఫ్యాక్టరీ వద్ద విఘ్నేశ్‌ను కలిసింది. అక్కడ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, విఘ్నేశ్ ఆమెపై దారుణంగా పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ సమయంలో సమీపంలో ఉన్న రైతులు ఆ యువతి అరుపులు విని అక్కడికి చేరుకొని మంటలు ఆర్పారు.
ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు వెంటనే అధికారులతో మాట్లాడి, బాధితురాలికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఆ యువతి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.