హైదరాబాద్: గచ్చిబౌలి భూముల వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు నివాసాల వద్దకు పోలీసులు చేరుకొని వారిని బయటకు రాకుండా ఆంక్షలు విధించారు.
ఇక హెచ్‌సీయూ పరిసరాల్లో నిరసనలు ఉద్ధృతంగా చోటుచేసుకున్నాయి. అక్కడ నిరసన చేపట్టిన సీపీఎం, సీపీఐ, బీజేవైఎం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు సమాచారం.
అరెస్టు అయిన వారిలో బీజేపీ నేత చికోటి ప్రవీణ్ కూడా ఉన్నారు. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని తరలించే క్రమంలో కారులో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఈ ఘటనపై రాజకీయ విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
గచ్చిబౌలి భూముల వివాదం రోజురోజుకీ తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రభుత్వం వైఖరి పట్ల విపక్షాలు మండిపడుతుండగా, నిరసనలకు కఠిన నిబంధనలు, పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.