జాతీయం: దేశంలో మొట్టమొదటిసారిగా మంకీపాక్స్ (mpox) అనుమానిత కేసు నమోదు కావడంతో, అప్రమత్తమైన కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే ఈ వ్యాధిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన నేపథ్యంలో, కేంద్ర ఆరోగ్య శాఖ తాజా హెల్త్ అడ్వైజరీలో దేశంలో ఇప్పటివరకు మంకీపాక్స్ నిర్ధారణ కాలేదని పేర్కొంది. కానీ, రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, వ్యూహాత్మక చర్యలు తీసుకోవాలని సూచించింది.
క్లస్టర్ల గుర్తింపు కోసం నేషనల్ ఇంటిగ్రేటెడ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్
మంకీపాక్స్ వ్యాప్తి, క్లస్టర్లను గుర్తించేందుకు నేషనల్ ఇంటిగ్రేటెడ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్‌ను వేగవంతం చేస్తూ, అనుమానిత కేసుల కోసం ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని పరిశోధనశాలల నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్నట్లు హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. చర్మ, లైంగిక సంబంధిత వ్యాధుల క్లినిక్స్‌పై దృష్టి పెట్టాలని, వ్యాధి లక్షణాలు ఉన్నవారిని నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు.
వ్యాధి నిర్ధారణ, అవగాహన చర్యలు
మంకీపాక్స్ వ్యాప్తి నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో అనవసర భయాలు పుట్టించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వ్యాధి లక్షణాలు కలిగిన అనుమానిత వ్యక్తులను టెస్ట్ చేయడం, వారికి కాంటాక్ట్ అయిన వారిని గుర్తించడం, తదితర చర్యలను వేగవంతం చేయాలని సూచించింది.
మంకీపాక్స్ వ్యాధికి రెండు వేరియంట్లు
1958లో మొదటిసారిగా గుర్తించిన మంకీపాక్స్, 1970లో మనిషికి సోకింది. ప్రధానంగా ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాధి ఎక్కువగా ఉండేది. ఈ వైరస్ రెండింటి వేరియంట్లు ఉన్నాయి – క్లాడ్-1 (కాంగోబేసిన్ క్లాడ్), క్లాడ్-2 (పశ్చిమ ఆఫ్రికా క్లాడ్). ప్రస్తుతం క్లాడ్-1 ఐబీ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది, ముఖ్యంగా లైంగిక సంబంధాల ద్వారా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
అప్రమత్తమైన కేంద్రం
ఇటీవల ఆఫ్రికన్ దేశం నుంచి వచ్చిన ఓ యువకుడిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడటంతో కేంద్రం అప్రమత్తమైంది. అతడిని ఐసోలేషన్‌కి తరలించడమే కాకుండా, టెస్ట్‌లు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తాజా అడ్వైజరీ జారీ చేసింది.