హైదరాబాద్ : తెలంగాణ యొక్క హైదరాబాద్ లోని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఫేస్‌బుక్ నిషేధం విధించింది. విద్వేషపూరితమైన ప్రసంగాలు, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఫేస్‌బుక్ నిబంధనల్ని ఉల్లంఘించిన కారణంగా ఈ నిషేదం విధిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఈ మేరకు ఫేస్‌బుక్ ప్రతినిధి ఒకరు ఈ- మెయిల్ ద్వారా వెల్లడించారు. హింసను ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేస్తున్న కారణంగా ఎమ్మెల్యే రాజాసింగ్ ఫేస్‌బుక్ అకౌంట్‌ని తొలిగిస్తున్నట్లు ప్రకటించారు. ఇదివరకే దీనికి సంబంధించి పలుసార్లు హెచ్చరించినా ఆయన ఫేస్‌బుక్ నియమావళిని ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. మరోవైపు ఫేస్‌బుక్ నిషేదంపై స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్ తనకు అధికారికంగా ఎలాంటి ఫేస్‌బుక్ అకౌంట్ లేదని, తన పేరుతో ఉన్న నకిలీ అకౌంట్లకు తాను బాధ్యుడిని కానంటూ వివరణ ఇచ్చారు.
కాగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఖాతాదారులున్న ఫేస్‌బుక్ బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలను చూసీచూడనట్లుగా వదిలేస్తోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నిషేధం విధించిడం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది.