EVM :ఇండియాలో ఇటీవల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ వినియోగంపై వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఓడిన పార్టీ లీడర్లు అలాగే నేషనల్ లో కాంగ్రెస్ నేతలు సైతం EVM పై అనుమానాలు ఉన్నట్లు కామెంట్ చేశారు.
అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం ఎప్పటికప్పుడు ఈ కామెంట్స్ కు కౌంటర్ ఇస్తోంది. ఆరోపణలు చేసేవారు హ్యాక్ చేసి నిరూపించాలి అని చాలెంజ్ చేస్తోంది.
అయితే టెక్నాలజీ విషయంలో అపారమైన పట్టు సాధించిన దిగ్గజం ఎలాన్ మాస్క్ EVM ల విషయంలో మరోసారి చేసిన కామెంట్స్ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. కృత్రిమ మేధ (AI) సాయంతో ఈవీఎంలను హ్యాక్ చేయడం ఎంతో సులభమని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని తెలిపారు. రీసెంట్ గా పెన్సిల్వేనియాలో జరిగిన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో మస్క్ ఈ అంశంపై మాట్లాడారు.
మస్క్ అభిప్రాయానికి అనుగుణంగా, సాంకేతిక పరిజ్ఞానం ఎంత పురోగమించినా ఎన్నికల వ్యవస్థకు మాత్రం దూరంగా ఉండాలని సూచించారు. “కంప్యూటర్ పోగ్రాంలు హ్యాక్ చేయడం సులువైన పని. ఓటింగ్ ప్రక్రియను తాకే సాంకేతికత ప్రజాస్వామ్య మూలాలను దెబ్బతీస్తుంది. ఈవీఎంలకు ఇది వర్తిస్తుంది,” అని అన్నారు. అలాగే దేశవ్యాప్తంగా పేపర్ బ్యాలెట్ విధానాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇది కేవలం స్వతంత్ర ఎన్నికలకే కాకుండా, ప్రజాస్వామ్యానికి కూడా ఎంతో ముఖ్యమని మస్క్ స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు ప్రపంచంలోని అనేక దేశాలు ఈవీఎంలను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. మస్క్ వంటి ప్రముఖ టెక్ దిగ్గజం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మీద తన ఆందోళన తెలియజేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఎలాన్ మస్క్ తరచుగా ఈ విషయంపై తన అభిప్రాయాలను బలంగా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, ఎన్నికల సురక్షతపై భారతదేశంలో కూడా కొత్తగా చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.