న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు దసరా పండుగ సందర్భంగా పెద్ద శుభవార్త తెలిపింది. సోయాబీన్, సన్ ఫ్లవర్, ముడి పామ్ ఆయిల్ పై కేంద్ర ప్రభుత్వం తక్షణమే బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేసినట్లు ప్రకటించింది. దానితో పాటుగా మార్చి 2022 వరకు వీటిపై విధిస్తున్న అగ్రి సెస్ అదనపు చార్జిని కూడా తొలగించినట్లు పేర్కొంది.
తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పండుగ సీజన్‌లో వంట నూనె ధరలు బాగా తగ్గే అవకాశం ఏర్పడింది. ఈ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు అనేది రేపు అనగా అక్టోబర్ 14 నుంచి మార్చి 31, 2022 వరకు అమల్లో ఉంటాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ)ఒక నోటిఫికేషన్ లో తెలిపింది.
ఈ సుంకం తగ్గించడం వల్ల తర్వాత పామాయిల్, సోయాబీన్, సన్ ఫ్లవర్ ఆయిల్ ముడి రకాలపై కస్టమ్స్ సుంకం వరుసగా 8.25 శాతం, 5.5 శాతం, 5.5 శాతంగా ఉంటుంది. అంతేగాకుండా, శుద్ధి చేసిన రకాల పొద్దు తిరుగుడు, సోయాబీన్, పామోలిన్, పామాయిల్ నూనెపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 32.5 శాతం నుంచి 17.5 శాతానికి తగ్గించారు.