తిరుమల: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను ముగించుకోవడం జరిగింది. తిరుమల శ్రీవారిని దర్శించుకుని, దీక్షను విరమించడానికి ఆయన ఇవాళ తిరుమలకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకొని, ఈ రోజు ఉదయం తన పెద్ద కుమార్తె ఆద్య, చిన్న కూతురు పొలెనా అంజని కొణిదెలతో కలసి స్వామివారి దర్శనానికి హాజరయ్యారు.
అయితే, పవన్ చిన్న కుమార్తె పొలెనా క్రిస్టియన్ మతానికి చెందినవారు కావడంతో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు దర్శనం కోసం డిక్లరేషన్ పత్రంపై సంతకాలు తీసుకోవడం జరిగింది. ఆమె మైనర్ కావడంతో తండ్రి పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకం చేశారు. ఈ పరిణామం ప్రస్తుతం రాష్ట్రంలో డిక్లరేషన్ వివాదం కొనసాగుతున్న వేళ పవన్ కళ్యాణ్ తన చర్యల ద్వారా విమర్శలకు చెక్ పెట్టినట్టయింది.
స్వామివారి దర్శనం అనంతరం, పవన్ కళ్యాణ్ తరిగొండ అన్నప్రసాద సముదాయానికి చేరుకొని, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించనున్నారు. అక్కడ భక్తులతో కలిసి సహపంక్తి భోజనంలో కూడా పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.
ఇది ఇలా ఉంటే, దాదాపు పదేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పొలెనా అంజని కనబడడంతో అభిమానులు ఆ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.