జాతీయం: రాష్ట్రాలలో దానా తుపాన్ విజృంభణ
బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాన్ విస్తృతంగా ప్రభావం చూపుతోంది. వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ తుపానుతో పాటు భారీ వర్షాలు, గాలివానలు ముంచుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దానా తుపాన్ కారణంగా రైళ్లు, పరీక్షలు, జంతు ప్రదర్శన కేంద్రాలు సహా పలు సేవలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
200కి పైగా రైళ్లు రద్దు:
తుపాను ప్రభావం దృష్ట్యా ఈస్ట్రన్ రైల్వే సీల్దా డివిజన్ గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల వరకు 190 లోకల్ రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే కూడా 14 రైళ్లను రద్దు చేసింది. ప్రజల సురక్షిత ప్రయాణం కోసం రైళ్లను దారిమళ్లిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా 23, 24, 25, 26, 27, 29 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకల సమాచారం కోసం 17 పట్టణాల్లో హెల్ప్‌లైన్ నంబర్లను కూడా ఏర్పాటు చేశారు.
ప్రజల తరలింపు:
ఒడిశాలోని 14 జిల్లాల్లో 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దానా తుపాను ఒడిశా తీరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు IMD తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అలలు 2 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడతాయని హెచ్చరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా 6000 సహాయక శిబిరాలు సిద్ధం చేశారు. పాలు, ఆహారం, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు.
భారీ వర్షాలు, సహాయక చర్యలు:
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం 19 ఎన్‌డిఆర్‌ఎఫ్ బలగాలు, 51 ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు, 178 అగ్నిమాపక బృందాలు ఇప్పటికే మోహరించాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా అప్రమత్తమై తగిన చర్యలు చేపట్టింది. పశ్చిమ బెంగాల్‌లో పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.
పరీక్షలు వాయిదా:
తుపాను ప్రభావం కారణంగా ఒడిశా ప్రభుత్వం 23-25 తేదీల్లో జరగాల్సిన పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. అలాగే 27న జరగాల్సిన ఒడిశా సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షను కూడా వాయిదా వేశారు.
జంతు సంరక్షణ, పార్కులు మూసివేత:
తుపాను ప్రభావంతో నందన్‌కానన్ జూ, సిమిలిపాల్ టైగర్ రిజర్వు, భితార్కనిక జాతీయ పార్కులను 25 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. తుపానులో మూగ జీవాలకు ఆశ్రయం కల్పించాలని, గాయపడిన జంతువుల సమాచారాన్ని 1962 హెల్ప్‌లైన్‌కు తెలియజేయాలని మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి గోకులానంద మల్లిక్ విజ్ఞప్తి చేశారు.