ఆంధ్రప్రదేశ్: ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు భారీ చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల సామర్థ్యం గల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలన్న దిశగా కార్యాచరణ ప్రారంభించాలని ఆయన అధికారులకు ఆదేశించారు.
శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ, ఇప్పటికే 70 నియోజకవర్గాల్లో ఇలాంటి ఆసుపత్రులు ఉన్నాయని, మిగిలిన 105 ప్రాంతాల్లో త్వరితగతిన ఆసుపత్రుల నిర్మాణం జరగాలని పేర్కొన్నారు. పీపీపీ మోడల్ ద్వారా ఆసుపత్రుల నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు పరిశ్రమల తరహాలో సబ్సిడీలు ఇవ్వాలన్నారు.
అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం, అంతర్జాతీయ స్థాయిలో వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రపంచ దేశాల ప్రజలు వైద్యం కోసం అమరావతికి రావాలన్నదే లక్ష్యంగా మార్గదర్శనం ఇచ్చారు.
గేట్స్ ఫౌండేషన్ సహకారంతో అత్యుత్తమ ఆరోగ్య సేవలను అందించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ స్థాయిలో డాక్టర్లు అందుబాటులో లేకపోయినా వర్చువల్ మాదిరిలో సేవలు అందించే విధానాన్ని రూపొందించాలని సూచించారు.
రోగాల చికిత్సకంటే ముందే ఆరోగ్య పరిరక్షణపై దృష్టిపెట్టాలని చంద్రబాబు అన్నారు. ప్రజల్లో అవగాహన పెంచి, జీవనశైలిని మార్చుకునేలా కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధుల స్క్రీనింగ్‌ను కూడా వేగవంతం చేయాలన్నారు.