ఆంద్రప్రదేశ్: తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు పెను దుమారం రేపాయి. సుప్రీం కోర్టు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో, ఆ తీర్పును ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతించారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా చంద్రబాబు సతీసమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
తిరుమలలో తన రెండో రోజు పర్యటనలో చంద్రబాబు అత్యాధునిక వకుళామాత సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ప్రారంభించారు. లడ్డూ తయారీలో పారదర్శకత, నాణ్యతపై ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు. భక్తుల అభిప్రాయాలను టీటీడీ పరిగణలోకి తీసుకోవాలని, సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు.
అలాగే, తిరుమల ఆలయ పవిత్రతను కాపాడే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గోవింద నామస్మరణ తప్ప మరేదీ వినిపించకూడదని, ప్రతి అంశంలో భక్తుల సంతృప్తిని కాపాడాలన్నారు. అటవీ విస్తరణను పెంచే ప్రణాళికలు రూపొందించాలని, తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించాలన్నారు.
ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, భవిష్యత్తులోనూ ఈ నాణ్యతను కొనసాగించాలని చంద్రబాబు అన్నారు. భక్తుల కోసం మరింత పరిశుభ్రత, ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.