హైదరాబాద్: కూకట్‌పల్లి ప్రాంతంలో డబ్బులు గాల్లోకి విసిరిన యూట్యూబర్ హర్షపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు, ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు హర్షపై కేసు నమోదు చేసినట్లు సనత్‌నగర్ పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై హర్ష కూడా స్పందించారు. తాను ఎంతో మందికి సాయం చేశానని, తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరు గాంచిన హర్ష, ఇటీవల హైదరాబాద్ ప్రధాన రహదారుల్లో డబ్బులు గాల్లోకి విసిరే వీడియోలతో హల్‌చల్ చేశాడు.
ఈ ఘటన సైబరాబాద్ పోలీసులు దృష్టికి రావడంతో హర్షపై కేసు నమోదు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతో పాటు, రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో నిబంధనలు ఉల్లంఘించాడని ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వాటిపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
రోడ్లపై ఇలాంటి చర్యలు ఏమిటని ప్రశ్నిస్తూ, పోలీసులు ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చూడాలంటూ సోషల్ మీడియా వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తనపై కేసులు నమోదు కావడం, వీడియోలు వైరల్ కావడంపై హర్ష తన వాదనను వెల్లడించారు.
తాను గతంలో ఎన్నో లక్షల రూపాయలతో ఎంతో మందికి సాయం చేశానని, కానీ ఈసారి తనను కావాలనే టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తోందని అన్నారు. తాను ఎప్పుడూ చేసిన సాయాన్ని బయటకు చెప్పకపోయినా, ప్రస్తుతం పరిస్థితుల రీత్యా చెప్పాల్సి వస్తోందని హర్ష అన్నారు.
ఈ విషయాలపై నెటిజన్లు వివిధ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.