అమరావతి: ఏపీలో బ్రూక్‌ఫీల్డ్ 5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునరుత్పాదక ఇంధనంలో పెట్టుబడులకు ఒక ప్రధాన కేంద్రంగా మారుతుంది.
గ్లోబల్ ఇన్వెస్టింగ్ సంస్థ బ్రూక్‌ఫీల్డ్, యాక్సిస్ ఎనర్జీ కలిసి ఏర్పాటుచేసిన క్లీన్ ఎనర్జీ ప్లాట్‌ఫార్మ్ ఎవ్రెన్ ఏపీలో 5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.
బ్రూక్‌ఫీల్డ్, యాక్సిస్ ఎనర్జీ ప్రతినిధులు ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇంధన శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎవ్రెన్ ప్రతినిధులు రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి తమ సిద్ధతను ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో 3500 మెగావాట్ల సౌర విద్యుత్, 5500 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను దశలవారీగా ఏర్పాటు చేసేందుకు ఈ సంస్థలు ముందుకొచ్చాయి.
ప్రస్తుతం 3000 మెగావాట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా పూర్తయిందని, 2026 చివరినాటికి ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయని చెప్పారు.
అదనంగా, ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ తయారీ, పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్, ఈ-మొబిలిటీ, గ్రీన్ అమ్మోనియా వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఎవ్రెన్ ఆసక్తి చూపింది.
ఈ ప్రాజెక్టులు రాష్ట్రానికి మాత్రమే కాకుండా, గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌లో భారతదేశాన్ని ముందుకు తీసుకువెళతాయని, పునరుత్పాదక ఇంధనంలో ఆంధ్రప్రదేశ్‌ను ఒక ముఖ్య కేంద్రంగా మారుస్తాయని బ్రూక్‌ఫీల్డ్ ప్రతినిధులు పేర్కొన్నారు.
బ్రూక్‌ఫీల్డ్ గ్లోబల్ లీడర్‌గా 1 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులతో 2,40,000 మందికి పైగా ఉద్యోగాలను కల్పించినట్లు బ్రూక్‌ఫీల్డ్ అధికారులు తెలిపారు.
పునరుత్పాదక ఇంధన రంగంలో తమ విశేష నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా 155,000 మెగావాట్ల ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు.
ఇంధన రంగంలో ఈ పెట్టుబడుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని, అలాగే పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రం స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి ఈ ప్రాజెక్టులు ఎంతో తోడ్పడతాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తోందని, పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రం ముందంజలో ఉంటుందని తెలిపారు. పునరుత్పాదక ఇంధనంలో ఆంధ్రప్రదేశ్‌ను ఒక ప్రధాన గమ్యస్థానంగా మార్చడానికి బ్రూక్‌ఫీల్డ్, యాక్సిస్ ఎనర్జీ కలసి ఏర్పాటు చేసిన ఎవ్రెన్ ప్రణాళికలు సహకరిస్తాయని, ఈ పెట్టుబడులు రాష్ట్రానికి మంచి భవిష్యత్‌ను తెస్తాయని అన్నారు.