అమరావతి: ఆంధ్రప్రదేశ్‌పై టాటా గ్రూప్ ఫోకస్ చేస్తోంది. ముఖ్యంగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) విశాఖపట్నంలో ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సెంటర్ ద్వారా 10 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి, ఇది రాష్ట్ర ఐటీ రంగానికి ఒక భారీ ప్రోత్సాహం. టాటా ముందుకు రావడంతో ఇతర సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్‌పై పెట్టుబడులకు ఆసక్తి చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి కావడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పలువురు పారిశ్రామికవేత్తలు అమరావతిలో కలిశారు. ఈ సమావేశంలో ప్రభుత్వం తీసుకుంటున్న, తలపెట్టిన విధానాలకు స్పందిస్తూ వారు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. టాటా సన్స్ గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
ఇటీవల మంత్రి నారా లోకేష్ ముంబైలో టాటా గ్రూప్ ఛైర్మన్‌ను కలవడంతో, టీసీఎస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్ధమవుతోంది. విశాఖలో ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పెట్టుబడులకు ఇస్తున్న ప్రోత్సాహాలను మంత్రి వివరించారు. టీసీఎస్ డెవలప్‌మెంట్ సెంటర్‌తోపాటు ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్స్), ఏరోస్పేస్, స్టీల్, హోటల్స్, టూరిజం రంగాల్లో కూడా టాటా గ్రూప్ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది.
“ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్” తో పాటూ ఇప్పుడు “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” నినాదంతో ఏపీ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ఆసక్తి చూపించాయి. లులూ, ఒబెరాయ్, బ్రూక్ ఫీల్డ్, సుజలాన్ వంటి ప్రముఖ సంస్థల తర్వాత టీసీఎస్ ఏపీకి రావడం, రాష్ట్రానికి ఒక పెద్ద శుభపరిణామంగా ప్రభుత్వం భావిస్తోంది.
ఏపీలో పారిశ్రామిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్నట్టు కనిపిస్తోంది. బాలారిష్టాలు అధిగమించి ఎన్ని ప్రాజెక్టులు కార్యరూపం దాలుస్తాయో వేచిచూడాలి మరి!