అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సర్కార్ మరో శుభవార్తను అందించింది. సంక్రాంతి నుంచి మరో కొత్త కార్యక్రమం అమల్లోకి రానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బందర్‌లో పర్యటించిన సందర్భంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2047 నాటికి భారత్ ప్రపంచ సూపర్ పవర్‌గా మారబోతుందని, ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ప్రజలంతా హార్డ్ వర్క్‌తో పాటు స్మార్ట్ వర్క్ చేయాలని పేర్కొన్నారు. టెక్నాలజీ, ఇంటెలిజెన్సీని సమర్థంగా ఉపయోగించుకుంటూ ముందుకు సాగాలని సీఎం సూచించారు.
సంక్రాంతి నుంచి అమల్లోకి రాబోతున్న ఈ కొత్త పథకం పేరు ‘P4’. ఈ పథకం పేదరిక నిర్మూలన లక్ష్యంగా రూపొందించబడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని “సూపర్ సిక్స్”లో భాగంగా ప్రకటించారు. ‘P4’ అంటే ‘పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్‌షిప్’ అని వివరించారు. జనవరి నుంచి ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు.
ఇప్పటికే దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. సంక్రాంతి తర్వాత ‘P4’ కార్యక్రమాన్ని నిమ్మకూరు ప్రాంతంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించనున్నారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ, డ్వాక్రా సంఘాలకు MSME హోదా కల్పించడం, స్వచ్చసేవకుల అభివృద్ధికి పటిష్టమైన చర్యలు తీసుకోవడం ద్వారా వారికి ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. పేదరిక నిర్మూలన లక్ష్యంతో, సర్వం శ్రామిక వనరులను పెట్టుబడిగా మార్చే కార్యాచరణతో రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన మార్గాలను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పుట్టుకురావాలని సీఎం అన్నారు.
‘P4’ పథకం పూర్తిగా పబ్లిక్, ప్రైవేట్, ప్రజలు, పార్టనర్‌షిప్ కలయికతో సమన్వయం చేస్తూ, రాష్ట్ర అభివృద్ధి కోసం కీలకంగా పనిచేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కులగణనకు బదులుగా నైపుణ్య గణన చేపట్టడం, మానవ వనరులను వినియోగించుకోవడం వంటి అంశాలపై కేబినెట్‌లో చర్చించి ఆమోదం పొందినట్లు తెలిపారు.