ఆంధ్రప్రదేశ్: ఏపీలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కుతున్నట్టు కనబడుతోంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కీలక ప్రకటన చేశారు.
గుంటూరులో జరిగిన సదస్సులో పాల్గొన్న హర్షకుమార్, త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కొత్త పార్టీ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించే వ్యక్తులు, సంఘాలతో కలిసి ఏర్పడుతుందని ఆయన స్పష్టం చేశారు.
త్వరలో కార్యాచరణ
కొత్త పార్టీకి సంబంధించిన అన్ని వివరాలు, విధి విధానాలు, నాయకత్వం వంటి అంశాలపై త్వరలోనే కార్యాచరణ ప్రకటించనున్నట్లు హర్షకుమార్ తెలిపారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలిద్దరూ ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతుండటంతో, తాను కొత్త పార్టీ స్థాపనపై నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
క్రీమీలేయర్ అంశంపై హర్షకుమార్..
ఎస్సీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ను తీసుకురావడం వల్ల దళిత వర్గాలు అన్యాయం జరుగుతోందని హర్షకుమార్ అభిప్రాయపడ్డారు. ప్రత్యేకించి ఉద్యోగస్తుల పిల్లల కోసం క్రీమీలేయర్‌ను పొందుపరిచిన కారణంగా దళితులు తీవ్ర నష్టపోతున్నారని అన్నారు. కేంద్రం ఈ అంశంపై మరోసారి సమీక్ష చేయవలసిన అవసరం ఉందని సూచించారు.
వర్గీకరణపై ప్రభుత్వానికి డిమాండ్
వర్గీకరణపై జిల్లాల వారీగా ఎలా ముందుకు సాగుతారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని కోరారు.
హర్షకుమార్ రాజకీయ ప్రస్థానం
జీవీ హర్షకుమార్ 2004, 2009లో కాంగ్రెస్ తరఫున అమలాపురం నుండి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన సమయంలో కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరినా, కొంతకాలం తర్వాత రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. కానీ, ఆ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ, తాజాగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు.
హర్షకుమార్ కొత్త పార్టీ స్థాపనపై చేసిన ఈ ప్రకటన, ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో – దానిపై ఎస్సీ వర్గాలలో స్పందన ఎంతవరకు ఉంటుందన్నది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న.