fbpx
Thursday, April 25, 2024
HomeAndhra Pradeshపీఎంవో కార్యాలయానికి తెలుగు ఐఏఎస్ ఆమ్రపాలి

పీఎంవో కార్యాలయానికి తెలుగు ఐఏఎస్ ఆమ్రపాలి

AMRAPALI-APPOINTED-DEPUTY-SECRETARY-IN-PMO

ఒంగోలు‌: ఆంధ్ర ప్రదేశ్ ఒంగోలు జిల్లాకు చెందిన మహిళ, ఐఏఎస్‌ అధికారిణి అయిన ఆమ్రపాలిని ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో నియమించారు. అపాయింట్‌మెంట్‌ ఆఫ్‌ కేబినెట్‌ సెలక్షన్‌ కమిటీ ఆమెను పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా నియమించింది. ఆమ్రపాలి స్వగ్రామం ఒంగోలు నగర శివారులోని ఎన్‌.అగ్రహారం.

ఈ గ్రామానికి చెందిన కాటా వెంకటరెడ్డి, పద్మావతిలకు ఆమె మొదటి సంతానం. అగ్రహారంలో పుట్టి విశాఖపట్నంలో ఉన్నత చదువులు చదివారు ఆమ్రపాలి. ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌లో 2010 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారిణిగా ఆమె విధుల్లో చేరారు. రాష్ట్రం విడిపోయాక తెలంగాణ రాష్ట్రంలోనే కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు.

అత్యంత చిన్నవయసులోనే ఈ పోస్టులో నియమితులైన వారిలో ఒకరిగా ఆమ్రపాలి నిలిచారు. ఈ పోస్టులో ఆమె 2023 అక్టోబర్‌ 23 వరకు అంటే మూడేళ్ల పాటు విధులు నిర్వర్తిస్తారు. ఆమ్రపాలి ఇప్పటి వరకు కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. ఐఏఎస్‌కు ఎంపికైన తరువాత 2011లో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా మొదట విధుల్లో చేరారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నగర కమిషనర్‌గా కూడా పనిచేశారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో జాయింట్‌ సీఈఓగా, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్‌ రెడ్డి వద్ద ప్రైవేటు సెక్రటరీగా కూడా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం పీఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.

ఆమ్రపాలి, చాలా నిబద్ధత గల పనితీరుతో సంచలనాల కలెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్‌లలో ఆమె ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఆమె తండ్రి కాటా వెంకటరెడ్డి ఆంధ్ర యూనివర్శిటీలో ఎకనమిక్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

ఆమ్రపాలి భర్త సమీర్‌ శర్మ ఐపీఎస్‌ అధికారి. 2011 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయనను 2018 ఫిబ్రవరి 18న వివాహం చేసుకున్నారు. సమీర్‌ శర్మది జమ్మూ కాశ్మీర్‌. ప్రస్తుతం ఆయన డయ్యూ, డామన్‌లో సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌(ఎస్పీ)గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమ్రపాలి సోదరి మానస గంగోత్రి కూడా 2007 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారిణి. ప్రస్తుతం కర్నాటక కేడర్‌లో ఇన్‌కంట్యాక్స్‌ విభాగంలో పనిచేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular