న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పాల ఉత్పత్తుల తయారీ సంస్థ క్వాలిటీ లిమిటెడ్ 1,400 కోట్ల రూపాయల బ్యాంక్ మోసానికి పాల్పడినట్లు తాజాగా అవినీతి నిరోధక శాఖ(సీబీఐ) చేపట్టిన తనిఖీల్లో వెల్లడైంది. ఢిల్లీతో సహా ఎనిమిది చోట్ల సోమవారం తనిఖీలు చేసిన అనంతరం క్వాలిటీ లిమిటెడ్‌పై బ్యాంక్ రుణాల చెల్లించకుండా మోసానికి పాల్పడినట్లు అభియోగాలు రుజువు కావడంతో సీబీఐ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో క్వాలిటీ డైరెక్టర్లు సంజయ్ ధింగ్రా, సిద్ధాంత్ గుప్తా, అరుణ్ శ్రీవాస్తవ ఉన్నారు. 2012లో ఏర్పాటు చేసిన బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 10 బ్యాంకుల కన్సార్టియం వారిపై చీటింగ్, ఫోర్జరీ, క్రిమినల్ కేసు, అవినీతి ఆరోపణలు ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. క్వాలిటీ లిమిటెడ్ 2010లో బ్యాంకు నుంచి క్రెడిట్ తీసుకుందని, అయితే 2018 ప్రారంభంలో చెల్లింపులను డిఫాల్ట్ చేయడం ప్రారంభించిందని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది.
దీంతో బ్యాంక్ ఫిర్యాదు మేరకు సీబీఐ దర్యాప్తును ప్రారంభించింది. కంపెనీ చేసిన మొత్తం, 13,147.25 కోట్ల రూపాయల అమ్మకాల్లో 7,107.23 కోట్ల రూపాయలు మాత్రమే బ్యాంకుల కన్సార్టియం ద్వారా మళ్ళించబడిందని బ్యాంక్ ఫోరెన్సిక్ ఆడిట్ సీబీఐకి చూపించింది. క్వాలిటి తన వ్యాపార కార్యకలాపాలను ఉధృతం చేయడం ద్వారా తన ఆర్థిక నివేదికలను మించిపోయిందని, రివర్స్ ఎంట్రీలు చేసి ఖాతాలను తారుమారు చేసినట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఫిర్యాదులో పేర్కొంది.
ఈ సందర్భంగా సీబీఐ ప్రతినిధి ఆర్కె గౌర్ మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఐడీబీఐ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధనలక్ష్మి బ్యాంక్, సిండికేట్ బ్యాంక్‌లతో పాటు బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని కన్సార్టియంలలో క్వాలిటి సంస్థ మొత్తం 1400.62 కోట్ల రూపాయల బ్యాంక్ రుణాలు చెల్లించకుండా మోసాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.
ఇదంతా బ్యాంక్ ఫండ్ల మళ్ళింపు, సంబంధిత పార్టీలతో లావాదేవీలు, కల్పిత పత్రాలు, రశీదులతో పాటు తప్పుడు ఖాతాలు, ఆస్తులను సృష్టించి బ్యాంకులను మోసం చేసినట్లు తెలిపారు. ఒకప్పుడు భారతదేశపు పురాతన, అత్యంత ప్రజాదరణ పొందిన ఐస్‌క్రీమ్ తయారీదారులలో ఉన్న క్వాలిటీ లిమిటెడ్ డిసెంబర్ 2018 నుంచి దివాలా పరిస్థితులను ఎదుర్కొంటుందని కూడా ఆయన వెల్లడించారు.